ఢిల్లీకి బదులు కోల్‌కతా నుంచి... రూబియో భారత పర్యటన వెనుక చారిత్రక కారణం

  • ఈ నెల‌ 23 నుంచి 26 వరకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటన‌
  • సంప్రదాయానికి భిన్నంగా ఢిల్లీకి బదులు కోల్‌కతా నుంచి ఆయన పర్యటన ప్రారంభం 
  • కోల్‌కతాలో ప్రపంచంలోనే అమెరికా ఏర్పాటు చేసిన రెండవ అత్యంత పురాతన దౌత్య కార్యాలయం
అమెరికా-భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడనుంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ నెల‌ 23 నుంచి 26 వరకు భారత్‌లో పర్యటించనున్నారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత రూబియో భారత్‌కు రావడం ఇదే తొలిసారి. ఇంధన భద్రత, వాణిజ్యం, రక్షణ రంగాల్లో సహకారం వంటి కీలక అంశాలపై ఈ పర్యటనలో చర్చలు జరగనున్నాయి. అయితే, ఈసారి రూబియో పర్యటన సంప్రదాయానికి భిన్నంగా న్యూఢిల్లీకి బదులుగా కోల్‌కతా నుంచి ప్రారంభం కానుండటం విశేషం.

కోల్‌కతా నుంచే ఎందుకు?
రూబియో తన పర్యటనను కోల్‌కతా నుంచి ప్రారంభించడం వెనుక ఒక బలమైన చారిత్రక కారణం ఉంది. ప్రపంచంలోనే అమెరికా ఏర్పాటు చేసిన రెండవ అత్యంత పురాతన దౌత్య కార్యాలయం (కాన్సులేట్) కోల్‌కతాలో ఉంది. 1792 నవంబర్ 19న అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్, బెంజమిన్ జాయ్‌ను కోల్‌కతాకు మొదటి యూఎస్ కాన్సుల్‌గా నియమించారు. ఆయన 1794లో భారత్‌కు చేరుకున్నారు. అప్పట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆయనను అధికారికంగా గుర్తించకపోయినా, ఈ నియామకంతోనే భారత్‌తో అమెరికా సంబంధాలకు అధికారికంగా బీజం పడింది. ఈ చారిత్రక ప్రాధాన్యత కారణంగానే రూబియో తన పర్యటనను ‘సిటీ ఆఫ్ జాయ్’గా పేరుతెచ్చుకున్న కోల్ కతా నుంచి మొదలుపెడుతున్నారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఒక అమెరికా విదేశాంగ మంత్రి కోల్‌కతాలో పర్యటించడం ఇదే ప్రథమం. గతంలో 2012లో హిల్లరీ క్లింటన్ ఇక్కడ పర్యటించారు.

భారత్‌కు భారీ ఇంధన ఆఫర్
భారత పర్యటనకు బయలుదేరే ముందు రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఎంత ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందో, అంత మొత్తాన్ని విక్రయించడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ యుద్ధం కారణంగా హ‌ర్మూజ్ జలసంధి మూసివేతతో అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రూబియో వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భారత్‌ను గొప్ప భాగస్వామిగా అభివర్ణించిన ఆయన, ఇంధన రంగంలో మరిన్ని అవకాశాలు ఉన్నాయని, వెనిజులా చమురు విషయంలో కూడా కలిసి పనిచేయవచ్చని సూచించారు.

క్వాడ్ సమావేశంలో పాల్గొననున్న రూబియో
ఈ పర్యటనలో భాగంగా మార్కో రూబియో ఈ నెల‌ 26న జరిగే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొంటారు. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి మోటెగి తోషిమిట్సు కూడా పాల్గొంటారు. తన పర్యటనలో కోల్‌కతాతో పాటు ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీలో కూడా రూబియో పర్యటిస్తారని, భారత ప్రభుత్వ ఉన్నతాధికారులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగాట్ తెలిపారు. కాగా, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ కూడా వచ్చే వారం భారత్‌కు రానున్నారని, న్యూఢిల్లీతో కలిసి పనిచేయడానికి అనేక అవకాశాలు ఉన్నాయని రూబియో వెల్లడించడం గమనార్హం.

Marco Rubio
US India relations
India visit
Kolkata US Consulate
Energy security
Quad meeting
S Jaishankar
US foreign policy
Bilateral talks
Trade relations

More Telugu News